రెడ్‌వైన్ కూడా సురక్షితం కాదు!..
ఎలాంటి మద్యంతోనైనా క్యాన్సర్ ముప్పు
అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి
హ్యూస్టన్: మద్యంలో రెడ్‌వైన్ ఆరోగ్యకరమని కొందరు భావిస్తుంటారు.
అయితే ఆ వాదన తప్పని తాజా పరిశోధన చెబుతోంది.
రెడ్‌వైన్, వైట్ వైన్ తాగేవారిలో క్యాన్సర్ ముప్పు ఒకేలా ఉందని పేర్కొంది.
అమెరికాలోని బ్రౌన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.
ఇందులో భాగంగా వారు 42 అధ్యయనాల్లో వెల్లడైన డేటాను విశ్లేషించారు.
రెడ్‌వైన్‌లో రెస్‌వెరట్రాల్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయని, అందువల్ల అది ఆరోగ్యకరమని భావిస్తుంటారు.
అయితే ఈ పానీయం క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుందనడానికి ఆధారాలేమీ మాకు లభించలేదని పరిశోధనకు నాయకత్వం వహించిన యున్‌యంగ్ చో పేర్కొన్నారు.
వైట్ వైన్ వల్ల మహిళల్లో క్యాన్సర్ ముప్పు ఎక్కువని కూడా వీరి అధ్యయనంలో వెల్లడైంది.
చర్మ క్యాన్సర్ ముప్పును అది 22 శాతం మేర పెంచుతుందని తేలింది.
అయితే సూర్యకాంతికి ఎక్కువగా లోనుకావడం వంటి జీవనశైలికి సంబంధించిన అంశాలు కూడా ఇందులో పాత్ర పోషించి ఉండొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.
నిత్యం తాగే ప్రతి గ్లాసు రెడ్‌వైన్‌కు 5 శాతం చొప్పున క్యాన్సర్ ముప్పు పెరగొచ్చని పేర్కొన్నారు.
ఈ లెక్కన మద్యం ఏ రూపంలో ఉన్నా ముప్పు పొంచి ఉంటుందని అర్థమవుతున్నట్లు తెలిపారు.