Reopening of modernized Sir Vizzi Swimming Pool
రూ.1.66 కోట్ల నిధులతో ఆధునికీకరించిన సర్ విజ్జీ స్విమ్మింగ్ పూల్ పున: ప్రారంభం
స్విమ్మర్లు అంతర్జాతీయ పోటీలలో రాణించేలా ప్రోత్సాహం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
ఆరోగ్యవంతమైన జీవితానికి వ్యాయామం, స్విమ్మింగ్ దోహదం: సామినేని ఉదయభాను
శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యానికి వ్యాయామం, స్విమ్మింగ్ ఎంతగానో తోడ్పడతాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు.
గాంధీనగర్ లో రూ. 1.66 కోట్ల వీఎంసీ నిధులతో ఆధునికీకరించిన సర్ విజ్జీ స్విమ్మింగ్ పూల్ ను ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు అవుతుశ్రీశైలజారెడ్డి, బెల్లం దుర్గాలతో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రాంగణంలోని జిమ్ లో ఏర్పాటు చేసిన పరికరాలను పరిశీలించారు, కాసేపు వ్యాయామం చేస్తూ ఉల్లాసంగా గడిపారు.
అనంతరం క్రీడాకారుల మధ్య స్మిమ్మింగ్ పోటీలను జెండా ఊపి ప్రారంభించారు.
కోవిడ్ నేపథ్యంలో మూతపడ్డ స్విమ్మింగ్ పూల్ ను పున: ప్రారంభించి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు.
సర్ విజ్జీ స్విమ్మింగ్ పూల్ కు దశాబ్దాల ఘన చరిత్ర ఉందని 1977 లోనే పూల్ ప్రారంభమైందని గుర్తుచేశారు.
నాటి నుంచి నేటి వరకు వేలాది మంది స్విమ్మింగ్ క్రీడాకారులు ఇక్కడ చక్కటి తర్ఫీదు పొంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించారని వెల్లడించారు.
వారిని మరింత ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో క్రీడాకారులు రెగ్యులర్ ప్రాక్టీస్ ను కొనసాగించేందుకుగానూ మూతపడ్డ ఈత కొలనును వినియోగంలోకి తీసుకురావడం జరిగిందన్నారు.
ఏటా నిర్వహించే సమ్మర్ క్యాంపులతో పాటు ఎప్పటికప్పుడు కొత్త సభ్యత్వాలతో నిత్యం ఈ పూల్ సందడి వాతావరణంతో ఉండేదని మల్లాది విష్ణు తెలిపారు.
చిల్డ్రన్స్ పూల్, డైవింగ్ పూల్, కాంపిటీషన్ పూల్ ను పూర్తిగా అభివృద్ధి పరచడంతో పాటు గ్యాలరీలను కూడా రీమోడలింగ్ చేసినట్లు తెలిపారు.
దీంతో పాటు సుందరీకరణ కోసం పూల్స్ చుట్టూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు.
జిమ్ ను కూడా ఆధునికీకరించడం జరిగిందన్నారు.
స్విమ్మింగ్ పూల్ పరిరక్షణకు ప్రధాన గేటు ఏర్పాటుతో పాటు ప్రహరీని అందమైన చిత్రాలతో సిద్దం చేసినట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు.
ఈ సదుపాయాలను నగర ప్రజలు సద్వినియోగపరచుకోవాలని సూచించారు.
ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆకాంక్ష అని తెలిపారు.
ఇందులో భాగంగా నగరంలో పార్కుల అభివృద్ధికి, వాకింగ్ ట్రాక్ ల నిర్మాణాలకు ఈ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు వివరించారు.
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో చక్కటి ప్రతిభను కనబరుస్తున్న స్విమ్మర్లు విజయవాడ నగరంలో అనేక మంది ఉన్నారన్నారు.
అటువంటి స్విమ్మర్లను మరింత మందిని తయారు చేసేందుకు ఈ స్విమ్మింగ్ పూల్ ఎంతగానో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో ఈఈ(ఇంజనీరింగ్) శ్రీనివాస్, డీఈ(గురునాథం), వైసీపీ కార్పొరేటర్లు బాలి గోవింద్, జానారెడ్డి, కోఆప్షన్ సభ్యులు అలీమ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ జమ్మల పూర్ణమ్మ, కోచ్ మాల్యాద్రి, నాయకులు ఆత్మకూరి సుబ్బారావు, పులపా కృష్ణ, ఆర్.కె., పఠాన్ భూపతి, తాటి శివ, పురిటి శివ, అత్తాడ సాయి, నాగు, రాంబాబు, వీఎంసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Post a Comment